సినీ కార్మికుల కోసం భారీగా విరాళాలు ఇస్తున్న తెలుగు హీరోలు
రూ. 20 లక్షల విరాళం ప్రకటించిన హీరో రవితేజ
కరోనా వ్యాప్తి భయం కారణంగా షూటింగ్‌లు లేక ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న తెలుగు సినీ కార్మికులను ఆదుకోవడంలో భాగంగా హీరో రవితేజ రూ. 20 లక్షలు విరాళం ప్రకటించారు. తన వంతుగా ఈ మొత్తాన్ని కరోనా క్రైసిస్ చారిటీకి అందజేస్తున్నట్లు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఆయన తెలిపారు. ఇవ్వడమనే విషయం వచ్చేదాకా తీసుకోవడమనే ప్రయోజనం ఎప్పటికీ పూర్తికాదనీ తెలిపిన రవితేజ.. ఇది బాధను కొలవడం కాదు, సినీ కార్మికుల అవసరాలను తీర్చడంలో తోడ్పాటు మాత్రమే అని పేర్కొన్నారు. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి అందరూ ఇంటిపట్టునే సురక్షితంగా ఉండాలని కోరారు.
హీరో శర్వానంద్ రూ. 15 లక్షల విరాళం
హీరో శర్వానంద్ ఆదివారం ఉదయం 11 గంటలకు తొలిసారిగా ‘ఐయామ్ శర్వానంద్’ అనే ట్విట్టర్ అకౌంట్‌తో సోషల్ మీడియాలో అడుగుపెట్టారు. దినసరి వేతనంతో పనిచేసే కార్మికులు సినిమా సెట్లపై అందరికంటే ఎక్కువగా కష్టపడుతుంటారని పేర్కొన్న ఆయన, షూటింగ్‌లు లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న తెలుగు సినీ కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ‘కరోనా క్రైసిస్ చారిటీ’కి రూ. 15 లక్షలు విరాళం ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ను తప్పనిసరిగా పాటిస్తూ, అందరూ తమ ఇళ్లల్లోనూ సురక్షితంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వాలు, వైద్యులు ఎప్పటికప్పుడు అందిస్తున్న సలహాలు, సూచనలను పాటించి ఆరోగ్యంగా ఉండాలని శర్వానంద్ కోరారు.
నాగ చైతన్య 25 లక్షల రూపాయల విరాళం
కరోనా ను నియంత్రించడానికి పాటిస్తున్న 21 రోజుల లాక్ డౌన్ వలన సినీ పరిశ్రమ స్తంభించింది. షూటింగులు లేక ఇబ్బంది పడుతున్న పేద సినీ కార్మికుల కోసం సినీ పరిశ్రమ ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ ఛారిటీ కి నాగ చైతన్య 25 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. మనకి రోజూ తోడుండే రోజువారీ సినీ వర్కర్స్ కి సహాయం చేయడం కోసం పరిశ్రమ పూనుకోవడం తనని కదిలించిందని, తన వంతుగా వారికి 25 లక్షల రూపాయల సహాయం అందిస్తున్నట్టు, ఇలాంటి సమయంలో అందరం కలిసికట్టుగా ఈ పరిస్థితిని ఎదుర్కోవాలని నాగ చైతన్య అన్నారు.
సినీ కార్మికులు, వైద్య సిబ్బంది సంక్షేమం కోసం దగ్గుబాటి ఫ్యామిలీ రూ. 1 కోటి ఆర్థిక సాయం
కరోనాపై పోరాటంలో దగ్గుబాటి ఫ్యామిలీ తమ వంతు భాగస్వామ్యం అందించేందుకు ముందుకు వచ్చింది. కరోనా వ్యాప్తి నిరోధంలో నిరంతరం శ్రమిస్తోన్న వైద్య సిబ్బంది సంక్షేమం కోసం, సినిమా షూటింగ్‌లు నిలిచిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కళాకారులు, సినీ కార్మికుల సంక్షేమం కోసం సురేశ్ ప్రొడక్షన్స్ కోటి రూపాయల ఆర్థిక సాయం ప్రకటించింది. రోజువారీ వేతనంతో పనిచేసే సినీ కార్మికులు నిత్యావరాల కోసం కష్టపడుతున్నారనీ, వాళ్లను ఆదుకోవడం తమ బాధ్యతగా భావించి, వారికి ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నామనీ సురేశ్‌బాబు, వెంకటేశ్, రానా తెలిపారు. అలాగే తమ జీవితాలకు ప్రమాదం అని తెలిసినా నిత్యం రోగులతో సన్నిహితంగా మెలగుతూ వారి ఆరోగ్యం కోసం నిరంతరం శ్రమిస్తూ వస్తున్న వైద్య సిబ్బంది సంక్షేమం కోసం ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నామని చెప్పారు.
ఈ సంక్షోభ కాలాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తోన్న లాక్‌డౌన్‌ను ప్రజలందరూ విధిగా పాటించాలని సురేశ్‌బాబు, వెంకటేశ్, రానా కోరారు. అత్యవసరం అయితేనే తగిన జాగ్రత్తలు తీసుకొని బయటకు వెళ్లాలని, గుంపులుగా మాత్రం వెళ్లవద్దని వారు చెప్పారు. అందరూ బాధ్యతగా వ్యవహరిస్తూ, ప్రభుత్వాలకు సహకరిస్తూ కరోనాపై పోరాటంలో విజయానికి తోడ్పడాలని సురేశ్‌బాబు విజ్ఞప్తి చేశారు. అందరూ తమ తమ ఇళ్లల్లోనే సురక్షితంగా ఉండాలని కోరారు.