రాయల్ క్లాన్ తో ఆకట్టుకున్న నటి పూనమ్ కౌర్
ఆగస్ట్ 7న జాతీయ చేనేత దినోత్సవం, భారతదేశ సాంస్కృతిక, ఆర్థిక వ్యవస్థలో భాగమైన చేనేత కార్మికుల యొక్క కీలక పాత్రను, ప్రాముఖ్యతను తెలియజేసే రోజుది. అందులో భాగంగా ఈ ఏడాది నటి పూనమ్ కౌర్ చేనేత కళ పట్ల తన మద్ధతుని తెలియజేసింది.. ఆమె హృదయపూర్వకమైన కథను తెలియజేసింది.
చేనేత, చేనేత వస్త్రాలపై పూనమ్ కౌర్ పరిశోధన చేస్తున్నారు. అలాగే న్యాయవాది కూడా అయిన ఆమెకు కేరళలోని ఇద్దరు యువరాణులు కలిసే సువర్ణావకాశం దక్కింది. వారే పూయం తిరునాళ్ పద్మనాభ సేవిని గౌరీ పార్వతి బాయి, పద్మనాభ సేవిని పద్మశ్రీ అవార్డు గ్రహీత గౌరీ లక్ష్మీ బాయిలను కలిశారు పూనమ్.
ఈ సందర్భంలో కేరళ సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడంలో తమ అనుభవాలను, అభిరుచిని ఇద్దరు యువరాణిలు తెలియజేశారు. పూయం తిరునాళ్ పద్మనాభ సేవిని గౌరీ పార్వతి బాయి పద్మనాభ స్వామి ఆలయం పట్ల తనకున్న భక్తిని తెలియజేయగా, పద్మనాభ సేవిని పద్మశ్రీ అవార్డు గ్రహీత గౌరీ లక్ష్మీ బాయి పూనమ్‌కు అందమైన కేరళ చేనేత చీరను బహుమతిగా ఇచ్చారు.
ఆటోఇమ్యున్ డిజార్డర్‌తో బాధపడుతున్నప్పటికీ పూనమ్ కౌర్ చేనేత అభివృద్ధిలో భాగంగా చేసున్న పనికి నిబద్ధతతో కట్టుబడి ఉన్నారు. అలాగే ఓ కొత్త ప్రాజెక్ట్‌ను చేపట్టాలని చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. విషయం తెలుసుకున్న యువరాణులు దేశంలోని చేనేత కార్మికులకు మంచి భవిష్యత్త ఉండేలా చూడాలని కోరటమే కాకుండా పూనమ్ చేయనున్న భవిష్యత్ కార్యాచరణలన్నీ విజయవంతం కావాలని అభిలషించారు.
ఈ అపూర్వ కలయిక కాలానికి, సామాజిక హద్దులకు అతీతంగా చేనేతల శాశ్వత సాంస్కృతిక ప్రాముఖ్యతను చేకూర్చేలా కనిపిస్తోంది.
నేటి జాతీయ చేనేత దినోత్సవం అనేది 1905 నాటి స్వదేశీ ఉద్యమాన్ని గుర్తుకు తెస్తుంది. భారతీయ తయారీ ఉత్పత్తులకు మద్దతు ఇవ్వటమే దీని ప్రధానోద్ధేశం. ఈ సంవత్సరం జాతీయ చేనేతో దినోత్సవ 10 వ వార్షికోత్సవం. భారతదేశం అంతటా వేడుకలు మరియు కార్యక్రమాలు జరుగుతున్నాయి.
చేనేత పరిశ్రమను ప్రోత్సహించడంలో పూనమ్ కౌర్ అంకిత భావంతో పని చేస్తున్నారు. ఇటీవల రాయల్టీతో ఆమె ఎదుర్కొన్న అనుభవం ఆమె అభిమానులకు మరింత స్ఫూర్తినిచ్చింది. సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించే ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, మహిళలు మరియు నేత కార్మికుల సాధికారత కోసం పూనమ్ చూపిస్తున్న నిబద్ధతను అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
భారతదేశ ఆర్థిక వ్యవస్థలో చేనేత పరిశ్రమ గణనీయంగా తోడ్పాటుని అందిస్తోంది. దీని వలన ప్రత్యక్షంగా, పరోక్షంగా 35 లక్షల మందికి ఉపాధి కలుగుతుంది. భిన్నత్వంలో ఏకత్వంలా ప్రతి ప్రాంతంలోనూ అద్భుతమైన వైవిధ్యాలలను చేనేత మనకు ఆవిష్కరిస్తుంది. ఈ వైవిధ్యం భారతదేశపు గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది.
బనారసి, జమ్దానీ నుంచి బాలుచారి, ఫుల్కారీ వరకు సంక్లిష్టమైన చేనేత పనులు, డిజైన్లు ప్రపంచవ్యాప్తంగా ఎనలేని ఆకర్షణను సంతరించుకున్నాయి. సహజ ఫైబర్స్, సాంప్రదాయ పద్ధతులను ఉపయోగించడం స్థిరమైన ఫ్యాషన్స్ ప్రోత్సహిస్తుంది, ఇది శతాబ్దాల పురాతన చేనేత వారసత్వాన్ని గౌరవిస్తుంది.
పూనమ్ కౌర్ ఇందులో భాగం కావటంతో చేనేత పరిశ్రమ ఎంత విలువైనదో అందరికీ అవగాహన పెరుగుతోంది. ఈ కీలక రంగానికి మద్దతు ఇవ్వాల్సిన ఆవశ్యకతను అందరికీ తెలియజేస్తోంది. ప్రతి చేనేత సృష్టిలో అల్లుకున్న కళాత్మకత మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతను జాతీయ చేనేత దినోత్సవం గుర్తు చేస్తోంది.