ఫాల్కే జయంతినేడు..స్మరించుకుందాం


భారతీయ సినీ నిర్మాత, దర్శకుడు, స్క్రీన్‌ప్లే-రచయిత దాదాసాహెబ్ ఫాల్కే జయంతి నేడు.ఆయనను స్మరించుకుందాం.పూర్తి పేరు ధుండీరాజ్ గోవింద్ ఫాల్కే. అందరికీ తెలిసిన పేరు దాదాసాహెబ్ ఫాల్కే. ఇతడి ప్రథమ సినిమా రాజా హరిశ్చంద్ర (భారతీయ మొదటి సినిమా) 1913. ఫాల్కే తన జీవితంలో 95 ఫీచర్ ఫిల్మ్ లు, నిర్మించాడు.ఆయన బహుముఖ ప్రతిభాశాలి. చెక్కబొమ్మలు చెక్కేవారు. సంగీతం, చిత్రలేఖనం, ఫోటోగ్రఫీ, మాజిక్, మౌల్డింగ్ వంటి అనేక రంగాలలో ఆరితేరిన ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే భారతీయ చలనచిత్ర పితామహుడు కాగలిగాడు. దాదా సాహెబ్ ఫాల్కేగా గణుతికెక్కాడు.

ధుండీరాజ్ గోవింద్ ఫాల్కే మహారాష్ట్ర సమీప త్రయంబకేశ్వర్ లో 1870 ఏప్రిల్ 30 న జన్మించాడు. ఫాల్కె తండ్రితో ఉద్యోగ నిమిత్తం బొంబాయి చేరాడు. కళాత్మక అభిరుచి ఉండటంతో 1885 లో జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో చేరాడు. చిత్రలేఖనం చేర్చుకున్నాడు. బరోడా లోని ప్రఖ్యాత “కళాభవన్”లో ఫోటోగ్రఫీ, మౌల్డింగ్, ఆర్కిటెక్చర్ వంటి అనేక కళలనే కాక మాజిక్ విద్యను కూడా నేర్చుకున్నాడు.

ప్రారంభ దశలో డ్రామా కంపెనీల నిమిత్తం ఒక ఫోటోగ్రఫర్ గా, సీన్ పెయింటర్ గా జీవితాన్ని ప్రారంభించాడు. ఆర్కియాలాజికల్ ప్రభుత్వ శాఖలో డ్రాప్ట్స్ మన్, ఫోటోగ్రాఫర్ గా 1903 లో చేరాడు. రాజా రవివర్మ పెయింటింగ్ లను ఆకళింపు చేసుకుని, ఒక ఎగ్జిబిషన్ లో తాను రచించిన తైల వర్ణ చిత్రాలను ప్రదర్శించి రజత పతకం పొందాడు. తర్వాత “స్వదేశీ ఉద్యమం”లో చేరాడు. ప్రభుత్వ ఉద్యో గం వదులుకొని స్వతంత్ర జీవనంలోకి ప్రవేశించాడు.

తొలుత లండన్ తదితర పాశ్చాత్య దేశాలకు వెళ్లాడు. తన ప్రయోగాలకు అవసరమైన పరికరాల కొనుగోలుకు ప్రయత్నించాడు. అయిదు పొండ్లకు సాధారణ కెమేరా తో స్వదేశం చేరాడు. ఒక బఠాణీ చెట్టు ఎదుగుదలను ఒక లఘుచిత్రం తీసి, తన పూర్వ స్నేహితుడు యశ్వంత్ నాదకర్ణి కి చూపాడు.

1912, ఫిబ్రవరి 1 న లండను వెళ్ళి, ‘బైస్కోప్’ వారపత్రిక ఎడిటర్ కాబౌర్న్ ను కలిశాడు. అతను ప్రారంభంలో నిరుత్సాహపరిచినా ఆ తరువాత ఎంతో సాయం చేశాడు. ఏప్రిల్ 1 న ఒక కొత్త కెమేరాతో తిరిగి వచ్చాడు. ఒక 200 అడుగుల చిత్రాన్ని తన కుటుంబ సభ్యుల మీద తీశాడు. శ్రీమతి సరస్వతీ బాయి ఫాల్కే తన బంగారు ఆభరణాలనన్నింటినీ అమ్మి డబ్బు సమకూర్చింది. ఇక నటీనటుల సమస్య ఎదురైంది. నటించడమే అతి హేయమైన, నీచ కార్యంగా భావించిన ఆ రోజుల్లో నటీమణులకోసం వేశ్యా వాటికలకు తెగ తిరిగాడు. ఆఖరుకు హోటల్ కార్మికుడు సాలుంకి హరిశ్చంద్రుని భార్య తారామి (చంద్రమతి) పాత్రను పోషించారు.

1913, ఏప్రిల్ 21 న ” ఒలెంపియా సినిమా” ధియేటర్ లో ప్రీవ్యూ ఏర్పాటు చేసి “రాజా హరిశ్చంద్ర”ను తిలకించడానికి అన్ని రంగాల ప్రముఖులను ఆహ్వానించాడు. మే 13 నుంచి వాణిజ్యపరంగా ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. “కార్పొరేషన్ సినిమా” ధియేటర్ లో వరుసగా 23 రోజులు ప్రదర్శించి రికార్డు బద్దలు కొట్టాడు

మలిచిత్ర నిర్మాణానికి స్వగ్రామం నాసిక్ కు వెళ్ళి, మూడు నెలల కాలంలో “మోహినీ భస్మసుర” చిత్రీకరించి, 1914 జనవరిలో విడుదల చేశాడు. ఆంగ్ల సినిమా ప్రదర్శనకు మాదిరిగా, ఈ సినిమా ప్రదర్శనలో ఒక రీలు కామెడీ చిత్రం “పిధాచెపజ”ను జతపరిచాడు. మొదటి రెండు సినిమాలు దిగ్విజయం సాధించగా “సావిత్రి సత్యవాన్”ను చిత్రీకరించి 1914 లో విడుదల చేసాడు. ఆదాయం కుప్పలు తెప్పలుగా వచ్చి పడటంతో ఋణ సౌకర్యం కూడా ఇబ్బడి ముబ్బడిగా వచ్చి చేరుకున్నాయి. ప్రతి చిత్రానికి 20 కాపీల వరకు డిమాండును సాధించుకోగలిగాడు.

ఫాల్కే 1913లో రాజా హరిశ్చంద్ర, ఆదే సంవత్సరం మోహినీ భస్మాసుర, సత్యవాన్ సావిత్రి (1914) శ్రీకృష్ణ జననం (1918) కాళీయ మర్దన్ (1919) నిర్మించారు. ఆ తరువాత సినిమా రంగంలో క్రమంగా వ్యాపార ధోరణి మొదలైంది. దాంతో పాల్కే పక్కకు తప్పుకున్నారు. సినిమా ప్రేమ ఆయన్ని నిలువనివ్వలేదు. తన పలుకుబడి, పరిచయాలు ఉపయోగించి నిధులు సమీకరించి 1937లో గంగావతరణ సినిమా తీశారు. నిండా మునిగిపోయారు. సినిమాను వ్యాపారంగా చూసి ఉంటే ఆయన పరిస్థితి బాగానే ఉండేది. సినిమాను విపరీతంగా ప్రేమించి దెబ్బతిన్నారు. తన వారసులను పేదరికంలోకి నెట్టేశారు. ఆయన దేశానికి తీసుకు వచ్చిన సినిమాతో సినీ వ్యాపారులు కోట్లు సంపాదించారు. పాపులారిటీని, రాజకీయాల్లో పదవులు సంపాదించారు కానీ ఫాల్కే మాత్రం కఠిక దరిద్రంలో మరణించారు. ఆయన కుమారుడు ముంభై వీధుల్లో చిల్లర వ్యాపారిగా జీవితం గడిపారు. బాల శ్రీకృష్ణునిగా మందాకిని నటించారు. ఆమె ఫాల్కే పెద్ద కూతురు. ఆమెనే తొలి భారతీయ బాలనటి.1966 లో ఇతని పేరు మీద దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, భారత ప్రభుత్వంచే స్థాపించబడింది.

భారతీయ సినిమా రజతోత్సవ వేడుకల్లో దాదాసాహెబ్ ఫాల్కే ఒక అనామకుడిగా కూర్చోవడం చూసిన శాంతారాం ఆయన్ని గుర్తించి వేదికపైకి తీసుకు పోయి 1938లో అప్పటికప్పుడు వేదికపై ఐదువేల రూపాయల పర్స్ అందజేశారు. ఆ డబ్బుతో ఫాల్కే తిరిగి సినిమా తీస్తాడేమోనని చాలా మంది భయపడ్డారు. ఎందుకంటే సినిమా అంటే ఆ మహనీయునికి అంత పిచ్చి. అందరూ ఒత్తిడి తెచ్చి ఆ డబ్బుతో నాసిక్‌లో ఒక ఇంటిని కొనిపించారు. అప్పటి వరకు ఫాల్కేకు సొంత ఇల్లు కూడా లేదు.

దాదాపు అందరూ మర్చి పోయిన తరుణంలో 1944, ఫిబ్రవరి 16 న తుది శ్వాస విడిచాడు. 95 సినిమాలను నిర్మించిన భారతీయ సినిమా పితామహుడు దరిద్రంతోనే కన్నుమూసినా, ఈ నాటికీ అతని జీవన మూల్యాలు ఆదర్శంగా, స్ఫూర్తినిచ్చేవిగానే ఉన్నాయి. ఆయనకు ప్రగాఢ నివాళులు

Related Articles

Back to top button
Send this to a friend