కరోనా క్రైసిస్ పై మెగా ఫైట్ ..
మెగాస్టార్ చిరంజీవి.. ఇండస్ట్రీలో ఎందరో అన్నయ్యా పిలుచుకునే లెజెండ్. ప్రస్తుతం ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగానూ వ్యవహరిస్తూ చిన్నా పెద్దా అందరినీ కలుపుకుని పోతున్న మెగాస్టార్ మరోసారి తన మెగా హార్ట్ ను చాటుకుంటున్నాడు. ఇండస్ట్రీలో రోజువారీ కూలీలు చేస్తూ బ్రతుకు బండి లాగించే వాళ్లు చాలామందే ఉన్నారు. క్రేన్ ఆపరేటర్స్ దగ్గర నుంచి జూనియర్ ఆర్టిస్ట్ ల వరకూ, లైట్ బాయ్ నుంచి ఎలక్ట్రీషీయన్స్ వరకూ.. ఇలా అన్ని విభాగాల్లోనూ రోజువారీ వేతనంతో బ్రతికే సినిమా లవర్స్ ఉన్నారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి కాటు వేస్తుండటంతో అన్ని షూటింగ్స్ నిలిచిపోయాయి. కేవలం షూటింగ్స్ ను మాత్రమే నమ్ముకుని బ్రతికే వీళ్లంతా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో మెగాస్టార్ ఓ కొత్త ఆలోచన చేశారు.
కరోనా క్రైసిస్ చారిటీ అంటూ ఓ కొత్త సంస్థ లాంటిది ఏర్పాటు చేశాడు. ఇందులో పరిశ్రమలో ఇబ్బంది పడుతోన్న పేద కళాకారుల సహాయం కోసం విరాళాలు ఇవ్వమని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఆయన పిలుపు మేరకు ఒక్క రోజులోనే మూడు కోట్ల 80లక్షలు విరాళాలుగా వచ్చాయి.
ప్రధానంగా చిరంజీవి స్వయంగా తనే కోటి రూపాయలతో మొదలుపెట్టారు. దీనికి అక్కినేని నాగార్జున అండ్ ఫ్యామిలీ నుంచి మరో కోటి రూపాయలు అందించాడు. కరోనా క్రైసిస్ చారిటీ కోసం రామ్ చరణ్ 30 లక్షలు, ఎన్టీఆర్ 25లక్షలు అనౌన్స్ చేశాడు. తమ్మారెడ్డి భరద్వాజ, సురేష్ బాబు, ఎన్ శంకర్, నిర్మాత దాము వంటి వారితో మొదలైన ఈ చారిటీ కోసం మరిన్ని విరాళాలు సేకరించబోతున్నారు. అలా మెగాస్టార్ చేసిన ఈ ఆలోచన ఎంతోమంది సినీ కళాకారులకు సమస్యలను తొలగించబోతోందన్నమాట.