సూపర్ స్టార్ పుట్టిన రోజు…!

హీరో కృష్ణగారు పుట్టిన రోజు ఇవాళ. అదేంటీ ఆయన బర్త్ డే మే 31న కదా అనుకుంటున్నారా.. నిజమే.. ఆయన పుట్టింది ఆ రోజే. కానీ హీరోగా, నటుడుగా జన్మించింది మాత్రం సరిగ్గా యాభైఐదేళ్ల క్రితం ఇదే రోజున. అంటే ఆయన నటించిన తొలి సినిమా తేనె మనసులు విడుదలైన రోజు ఇవాళ. 1965 మార్చి 31న విడుదలైన ఈ సినిమాకు నేటికి 55యేళ్లు. ఈ సందర్భంగా తేనె మనసులుకు సంబంధించిన కొన్ని విశేషాలను తెలుసుకుందాం..

తేనె మనసులు.. ఈ పేరు వినగానే కృష్ణగారు గుర్తొస్తారు. తెలుగు సినిమాపై ఎన్నటికీ చెరగని సంతకం వేసిన కృష్ణగారి తొలి సినిమాగా తేనె మనసులుకూ ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఆ రోజుల్లో కొత్తవారిని పరిచయం చేయడం ఓ సాహసంగా భావించేవారు. బాబూ మూవీస్ వారికి ఈ కథ నచ్చింది. అంతేకాదు సీనియర్స్ ను తీసుకుని రెమ్యూనరేషన్స్ ను వేస్ట్ చేయడం కంటే కొత్తవారితో తీసినా సినిమా ఆడుతుంది అనే నమ్మకం వచ్చింది. అందుకే కొత్త ఆర్టిస్టుల కోసం వేసిన ప్రకటనకు స్పందించిన వాళ్లెంతోమంది ఉన్నారు. అందులో సెలెక్ట్ అయింది రామ్మోహన్, కృష్ణగారు. హీరోయిన్లు సంధ్యారాణి, సుకన్య కూడా కొత్తవారే కావడం విశేషం.
ఈ సినిమాకు ముందు ఆదుర్తి సుబ్బారావు మూగ మనుసులుతో సూపర్ హిట్ అందుకుని ఉన్నారు. ఆ సినిమాకు రచయితగా పనిచేసిన ముళ్లపూడి వెంకట రమణనే ఈ చిత్రానికి రచన చేయమన్నారు. కొత రచన అయ్యాక ఇద్దరికీ భేదాభిప్రాయాలు వచ్చాయి. దీంతో అప్పటికి సహాయ దర్శకుడుగా కె విశ్వనాథ్ తో పాటు ఆత్రేయతోనూ కొంత భాగం స్క్రిప్ట్ రాయించుకుని సెట్స్ పైకి వెళ్లారు దర్శకులు ఆదుర్తి.
ఈ సినిమాను తొలుత బ్లాక్ అండ్ వైట్ లో మొదలుపెట్టారు. కానీ అప్పుడప్పుడే ఎంటర్ అవుతోన్న ఈస్ట్ మన్ కలర్ లో అయితే బావుంటుంది అనుకున్నారు. అలా మొదటి షెడ్యూల్ ను పక్కన బెట్టి మళ్లీ మొత్తం కలర్ లో తీశారు. వీరు ఊహించినట్టుగానే సినిమా అద్భుత విజయం సాధించింది. ఆర్టిస్టులందరికీ మంచి పేరు తెచ్చింది. అయితే మరో హీరోగా నటించిన రామ్మోహ కెరీర్ ఎక్కువ కాలం సాగలేదు. కానీ కృష్ణగారు మాత్రం తెలుగు సినిమా చరిత్రలో సగభాగానికి సాక్ష్యంగా నిలిచిపోయారు.
మొత్తంగా ఈ సినిమా విడుదలై నేటికి సరిగ్గా 55యేళ్లైంది. అయినా ఇప్పటికీ ఈ సినిమాను అభిమానించేవాళ్లు ఉన్నారు. ఈ సందర్భంగా తనకు అత్యంత ఇష్టమైన సినిమా అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ కూడా పెట్టాడు. మొత్తంగా ఇప్పుడు కృష్ణ ఫ్యామిలీకి తెలుగు లో ఓ సామ్రాజ్యం ఏర్పడింది. అందుకు పునాది ఈ తేనె మనసులు. అందుకే ఈ చిత్రం వారికీ ఎప్పుడూ ప్రత్యేకమైనదే అని చెప్పాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Send this to a friend