మద్యం దొరకడం లేదని ఆత్మహత్య…!
దేశంలో కరోనా విజృంభిస్తోంది. వరుసగా మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ఇప్పటికే మన దేశంలో దాదాపు 27 కరోనా మరణాలు సంభవించాయి. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ప్రజల్లో అవగాహన లోపించడం.. బయటి దేశాల నుంచి వచ్చిన వారి నిర్లక్ష్యం ఫలితంగా ఇవి వ్యాధి విస్తరిస్తూనే ఉంది. దీంతో రాబోయే రోజుల్లో మరిన్ని కరోనా మరణాలు సంభవించ వచ్చు అంటున్నాయి ప్రభుత్వాలు. ఇక కరోనా నివారించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న లాక్ డౌన్ ఎఫెక్ట్ పేద, మధ్య తరగతి వర్గాలపై విపరీతంగా పడుతోంది. అటు వలస కూలీల పరిస్థితి అన్ని రాష్ట్రాల్లోనూ దయనీయంగానే ఉంది. అయితే సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అన్నట్టుగా ప్రభుత్వాలు కొన్ని ‘మందస్తు’జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల మందుబాబులు సైతం మరణిస్తోన్న విచిత్ర పరిస్థితిని ఇప్పుడు దేశం చూస్తోంది.
కరోనా దేశానికి వచ్చి నెల రోజులు అవుతోంది. ఈ నెల రోజుల్లో నిన్నటి వరకూ నమోదైన మరణాలు 27. కానీ లాక్ డౌన్ ప్రకటించి వారం రోజులు. కానీ ఈ వారం రోజుల్లో మద్యం దొరకడం లేదని ఆత్మహత్య చేసుకున్నవారు 9మంది. ఆశ్చర్యంగ అనిపించవచ్చు. కానీ ఇది నిజం. పైగా ఇవి అధికారికంగా నమోదైన లెక్కలే కావడం విశేషం. మొత్తంగా మొదటి ఆత్మహత్య కేస్ కేరళలో నమోదైంది. తర్వాత కేరళలోనే మరో ఇద్దరు మందు దొరకడం లేదని ఆత్మహత్య చేసుకున్నారు. ఇక నిన్న ఆది వారం మొన్న శనివారం రోజున కర్ణాటక రాష్ట్రంలో ఏకంగా నలుగురు సూసైడ్ చేసుకున్నారు. ఇక శనివారం రోజునే ఆంధ్రప్రదేశ్ లో ఓ రిక్షా కార్మికుడూ సైసైడ్ చేసుకున్నాడు.
ఇక మహబూబ్ నగర్ జిల్లాలో ఒక వ్యక్తి మద్యం దొరక్క మరణిస్తే.. మరో వ్యక్తికి అనుకోకుండా కాస్త ఎక్కువ మద్యం దొరికిందట. ఆ మొత్తం ఒకే రోజు తాగడంతో అతనూ మరణించాడు.
ఏదేమైనా తెలంగాణ రాష్ట్రంతో పాటు అనేక రాష్ట్రాల్లో మద్యం ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. ఎక్సైజ్ సుంకం లేకపోవడం వల్లే ఇప్పుడు కేసిఆర్ ఎమ్మెల్యేలకు జీతాలు ఇవ్వను అంటున్నాడు. అలాగే ఉద్యోగుల జీతాల్లోనూ కోత పెడతా అంటున్నాడు. అయితే తెలంగాణలో ఈ నెల 31 వరకూ లాక్ డౌన్ ఉంది. వీళ్లు కేంద్రం ఆదేశాలు పట్టించుకోకపోతే బుధవారం నుంచి వైన్ షాపులు తెరిచే అవకాశం ఉంది.
మరవైపు కేరళలో మద్యం మరణాలు ఉండకూడదని అక్కడి ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఎవరికైనా మద్యం తాగకపోతే చచ్చిపోతాడని వైద్యులు సర్టిఫికెట్ ఇస్తే వారికి మద్యం అమ్ముతారు. అలాగే ఎవరైనా స్వచ్ఛందంగా మద్యం మానేయాలనుకుంటే వారిని ప్రభుత్వమే కౌన్సెలింగ్ తో కూడిన డీ ఎడిక్షన్ ఏర్పాటు చేస్తుంది.
ఏదేమైనా అటు కేంద్రం, ఇటు రాష్ట్రాలు కొందరు ముందు చూపు లేక మరికొందరు మందు చూపు లేక అనవసర మరణాలకు కారణాలవుతున్నారు.