నిర్భయ దోషులకు ఉరి 

ఎనిమిదేళ్ల క్రితం దేశ నడిబొడ్డున నిర్భయపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసిన కేస్ లో దోషులైన నలుగురికి ఉరిశిక్ష అమలైంది. వీరిలో పవన్ గుప్తా, వినయ్ శర్మ, ముఖేష్ సింగ్, అక్షయ్ ఠాకూర్ లు ఉదయం ఉరితో మరణించారు. ఎనిమిదేళ్లుగా ఈ శిక్షనుంచి తప్పించుకోవడానికి దోషులు అనేక ప్రయత్నాలు చేశారు. నిన్నటి వరకూ కూడా ఉరిని తప్పించుకునేందుకు అనేక రకాలుగా ప్రయత్నించారు. కానీ వారు వేసిన అన్ని పిటిషన్స్ ను కోర్ట్ తోసిపుచ్చింది. దీంతో గతంలో వెలువడిన తీర్పు ప్రకారం ఈ ఉదయం 5.30గంటలకు నలుగురు దోషులకు ఉరిశిక్షను అమలు చేశారు. అయితే ఈ శిక్షను తలచుకుని దోషులు రాత్రంతా నిద్రపోలేదు. నిన్నటి నుంచే నిశ్శబ్ధంగా ఉంటూ గార్డులతో కూడా మాట్లాడలేదు. మొత్తంగా అర్థరాత్రి వరకూ శిక్ష అమలు కాదనే నమ్మకంతో ఉన్నవారి పాపం చివరికి పండింది.
ఉదయం 4.15గంటలకు నలుగురికీ అల్పాహారం ఇచ్చారు. తర్వాత డాక్టర్ పర్యవేక్షణలో వారికి ఆరోగ్యం చూసిన తర్వాత ఉరికి అంతా సిద్ధం చేశారు. ఈ శిక్ష అమలు కోసం ఒక్కో దోషికి 12మంది సిబ్బంది చొప్పున మొత్తం 48మంది గార్డులు భద్రతగా వచ్చారు. ఇక సరిగ్గా 5.30 గంటలకు వారికి ఉరిశిక్ష అమలైంది. అరగంట పాటు వారు ఉరికి వేలాడుతూనే ఉన్నారు. 6.00గంటలకు డాక్డర్ పరీక్షించి ‘మరణించారు’అని చెప్పిన తర్వాతే ఉరి నుంచి వారి ‘మృతదేహాలను’ బయటకు తీశారు.
ఒక కేస్ లో నలుగురికి ఉరిశిక్ష పడటం అమలు కావడం దేశంలో ఇదే ప్రథమం. మొత్తంగా ఈ ఉరి కార్యక్రమం గురించి అందరికీ తెలుసు కాబట్టి.. జైలు బటయ ఉదయాన్నే కొందరు మహిళలు, సామాజిక కార్యకర్తలు వారి ఉరి అమలవుతున్నంత సేపూ సంబరాలు చేసుకున్నారు. మొత్తంగా ఎనిమిదేళ్లుగా సాగుతూ వస్తోన్న ఈ శిక్షా కార్యక్రమాన్ని అమలు చేయడంతో న్యాయ వ్యవస్థపై మరింత గౌరవం పెరిగిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Articles

Back to top button
Close
Send this to a friend