జనతా కర్ఫ్యూకి అద్భుతమైన స్పందన

    Written By: Last Updated:

జనతా కర్ఫ్యూ.. భారతదేశం ఇంతకు ముందెప్పుడూ వినని మాట. ఎవరికి వారుగా ఇంట్లోనే ఉంటూ కరోనా వ్యాప్తిని అరికట్టే బాధ్యత తీసుకోవడం దీని వెనక ఉన్న అర్థం. ఒక్క రోజుకే కరోనా కంట్రోల్ అవుతుందా అనేం కాదు.. అయినా ప్రధాన మంత్రి మోదీ చెప్పిన మాటలకు ఏ ప్రతిపక్షం కూడా అడ్డు చెప్పకుండా తుచా తప్పకుండా పాటించడం గమనార్హం. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ జనతా కర్ఫ్యూ గ్రాండ్ సక్సెస్ అయిందనే చెప్పాలి. అలాగే ఐదు గంటలకు స్వచ్ఛ కార్మికులు, డాక్టర్లు, పోలీస్ లతో పాటు ఈ కరోనా కంట్రోల్ కోసం పాటు పడుతోన్న అందరు ఉద్యోగులు, సంఘాలకు సంఘీ భావంగా అందరూ చప్పట్లతో వారికి అభినందనలు తెలపాలి అన్న మాటను కూడా చాలామంది పాటించారు.
ఇక జనతా కర్ఫ్యూలో భాగంగా రోడ్లన్నీ నిర్మానుష్యం అయిపోయాయి. ఇలాంటి వాతావరణం గతంలో ప్రజలే స్వచ్ఛందంగా పాల్గొన్న సందర్భాలు లేవు కాబట్టి.. ఈ దేశ చరిత్రలో ఇదే ప్రథమం అని చెప్పాలి. దేశ వ్యాప్తంగా అక్కడక్కడా బయటకు వచ్చిన యువకులపై పోలీస్ ల అత్యుత్సాహం చూపించడం మినహా దాదాపు జనతా కర్ఫ్యూ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది. ఇక దీని తర్వాతి కార్యాచరణ ఏంటి.. కరోనా వ్యాపించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాయి.. ఇందులో మరోసారి ప్రజలను ఎలా భాగస్వాములను చేస్తారు అనేది చూడాలి.