కోమటిరెడ్డి ఆట మొదలుపెట్టాడా..?

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తన సోదరుడు రాజగోపాల్ రెడ్డితో కలిసి నల్గొండ కాంగ్రెస్ రాజకీయాలను శాసిస్తూ వచ్చారు. తెలంగాణ ఏర్పడి తర్వాత వారికి కొంత బ్రేక్ పడింది. అయినా ఆ ఇద్దరికీ మంచి ప్రజాబలం ఉందనేది అందరికీ తెలుసు. ఆ బలంలోనే మధ్యలో వేరే పార్టీలోకి వెళ్లాలని చూశారు. ముఖ్యంగా టిఆర్ఎస్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. కెసిఆర్ పడనివ్వలేదు. ఓ దశలో బిజెపిలోకి వెళతారు అనే ప్రచారమూ జరిగింది. కానీ అక్కడా కుదర్లేదు. దీంతో కాంగ్రెస్ లోనే తాడోపేడో తేల్చుకోవాలనుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ లో పట్టు సాధించాలంటే ఇప్పుడున్న ఏకైక మార్గం పిసిసి ప్రెసిడెంట్ గా తను నిలవడం గెలవడం. గెలవడానికి ఇవి ఎన్నికలు కాకపోవచ్చు. కానీ అంతకంటే రసవత్తరమైన డ్రామాలకు వేదిక కదా కాంగ్రెస్ పార్టీ. అందుకే కోమటి రెడ్డి ఢిల్లీ నుంచి మొదలుపెట్టాడు.
తాజాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలిశాడు. అతను ఎందుకు కలిశాడు. ఏం మాట్లాడాడు. అనేది ఎవరికీ తెలియదు. కానీ ఆ క్యాంప్ నుంచి మాత్రం సోనియానే అతన్ని పిలిచిందని.. ఈ సారి పిసిసి ప్రెసిడెంట్ గా కోమటిరెడ్డినే చేయమని ఆమే అడిగారని.. అధినేత్రి ఆదేశిస్తే కాదంటాడా..? అందుకే ఆమె కోరిక మేరకు తెలంగాణకు కాబోయే పిసిసి ప్రెసిడెంట్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డినే అనే ప్రచారం మొదలైంది. దీంతో ఇప్పటికే కాంగ్రెస్ లో వర్గపోరు మళ్లీ మొదలైంది. కొన్నాళ్లుగా నాకివ్వండి పిసిసి ప్రెసిడెంట్ అని పబ్లిక్ గా చెబుతోన్న జగ్గారెడ్డి నుంచి ఆల్మోస్ట్ ఫేడవుట్ అయిన జానారెడ్డి వరకూ రుసరుసలాడుతున్నారట. మరోవైపు భట్టి విక్రమార్క కూడా తన పట్టును నిలుపుకునే పనిలో ఉన్నాడు. ఎమ్.పిగా గెలిచిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఊసే లేదు. మొత్తంగా కోమటిరెడ్డి ప్రచారంతో కాంగ్రెస్ లో మరోసారి లుకలుకలు బయటపడుతున్నాయి. ఇదే ఊపులో అతన్ని ప్రెసిడెంట్ గా చేస్తే మాత్రం మరికొన్ని వికెట్స్ పడతాయి. కొత్తగా కొందరు చేరే అవకాశమూ లేకపోలేదు. ఏదేమైనా ఢిల్లీ నుంచి కోమటిరెడ్డి మొదలుపెట్టిన పిసిసి రాజకీయం ఇప్పుడు హైదరాబాద్ లో వేడి రాజేసిందనే చెప్పాలి.

Related Articles

Back to top button
Send this to a friend