ఉప్పెన కోసం సుకుమార్ ఏం చేస్తున్నాడో..?
ప్రతి దర్శకుడికీ శిష్యులుంటారు. అయితే అందులో ప్రియ శిష్యులు అనే టీమ్ సెపరేట్ గా ఉంటుంది. తమ శిష్యులు కూడా దర్శకులుగా ఎదుగుతున్నప్పుడు గురువులుగా సంతోషిస్తారు(అఫ్ కోర్స్ కొంతమంది జెలసీగానూ ఫీలవుతారనుకోండి). అయితే సుకుమార్ మరో అడుగు ముందుకు వేస్తాడు. వారికి అన్ని విషయాల్లోనూ అండగా ఉంటాడు. అవసరమైతే తన శిష్యుల కోసం నిర్మాతగా కూడా మారతాడు. అలాగే ఇప్పుడు తన శిష్యుడు బుచ్చిబాబు రూపొందించిన ఉప్పెన సినిమా కోసం అంతా తానే అవుతున్నాడు. వాల్లు ఏ చిన్న రాంగ్ స్టెప్ వేసినా కెరీర్ కు ఇబ్బంది అవుతుంది అని ఫీలవుతాడో లేక ఇంకేదైనా కారణం ఉందో కానీ సుకుమార్ ఉప్పెన సినిమా కోసం చాలానే చేస్తున్నాడు.
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతోన్న ఉప్పెన సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ ఏప్రిల్ 2న విడుదల అనుకున్నారు. కానీ కరోనా ఎఫెక్ట్ తో మే 7కు పోస్ట్ పోన్ చేసుకున్నారు. దీంతో సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కు మరింత టైమ్ దొరికింది. దీంతో సుకుమార్ రంగంలోకి దిగాడు. ఈ మూవీ ఎడిటింగ్ ను దగ్గరుండి చూసుకుంటున్నాడట ఇప్పుడు ఎలాగూ సుకుమార్ కూ షూటింగ్స్ లేవు కదా. అందుకే ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ లో తనదైన సలహాలు సూచనలు చేస్తూ ఎడిటింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడట. మొత్తంగా సినిమాను రెండున్నర గంటల అవుట్ పుట్ తో ఫైనల్ చేశాడని అంటున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ మూవీలో కృతి శెట్టి హీరోయిన్ గా పరిచయం అవుతోంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఓ కీలక పాత్రలో నటించాడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఉప్పెనతో టాలీవుడ్ కు మరో మెగా హీరో పరిచయం అవుతున్నాడన్నమాట.