ఇండస్ట్రీలో అందరికీ ఫోన్లు చేస్తోన్న ‘దాసరి చిరంజీవి’


మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు దాసరి చిరంజీవిలా మారిపోయాడా..? అంటే అవుననే అంటున్నారు. ఈ మధ్య ప్రతి అంశంలోనూ అచ్చంగా ఆయన దాసరి నారాయణరావుగారి లాగానే స్పందిస్తున్నారు. అవసరమైతే చురకలు అంటిస్తున్నారు. నిర్మాతల శ్రేయస్సే ప్రధానం అంటూ గట్టిగా పట్టు బడుతున్నాడు. అలాగే సినిమా పరిశ్రమలో ఎవరైనా వచ్చిన తమ సినిమా ఫంక్షన్స్ కు రావాలని అడగడమే ఆలస్యం.. వెంటనే వెళ్లిపోతున్నాడు. అద్భుతమైన స్పీచులూ దంచుతున్నాడు. ఈ క్రమంలోనే ఆయన దాసరి లేని లోటు కనిపించనీయకుండా ప్రయత్నిస్తున్నాడు అంటున్నారు చాలామంది. అదే టైమ్ లో కొన్నిసార్లు దాసరిలాగానే కాస్త అతిగా స్పందిస్తున్నారు అనేదీ వినిపిస్తోంది.
రీసెంట్ గా మెగాస్టార్.. సినిమాను మూడు నెలల్లోనే పూర్తి చేయాలని ఖచ్చితంగా చెబుతూ తానూ పాటిస్తానంటూ ఆచార్య సినిమా విషయంలో కొరటాలకు డెడ్ లైన్ పెట్టాడు. అదే వేదికపై మహేష్ బాబు లాంటి వారిని కూడా అలాగే చేయమని చెప్పాడు. కానీ సినిమా టర్మ్స్ మారిపోయిన తరుణంలో ఇది సాధ్యమా..? అయినా చిరంజీవి చెప్పింది పరిశ్రమ మంచికే. కానీ ఆయన వెనక కొందరు సెటైర్స్ వేస్తున్నారు.
ఇక లేటెస్ట్ గా క్యారవాన్ సంస్కృతిపై మెగాస్టార్ చెప్పిన మాటలు అక్షర సత్యాలు. క్యారవాన్ సంస్కృతి వచ్చిన తర్వాతే పరిశ్రమలో చాలామంది హీరోలు బద్దకిష్టులయ్యారు అనేది నిజం. అలాగే క్యారవాన్ ను స్టేటస్ సింబల్ గా మార్చుకున్నారు. కాస్త గుర్తింపు వచ్చిన కమెడియన్స్ సైతం క్యారవాన్ డిమాండ్ చేస్తూ నిర్మాతలను నిండా ముంచుతున్నారు. ఈ విషయంలో పరిశ్రమ, నిర్మాతలు ఓఖచ్చితతమైన నిర్ణయం తీసుకుంటే కానీ నిర్మాతలు బతికి బట్టకట్టరు.
ఇక తాజాగా కరోనా వైరస్ నేపథ్యంలో సినిమా థియేటర్స్ ను బంద్ చేసింది ప్రభుత్వం. అయితే మెగాస్టార్ చిరంజీవి మరో అడుగు ముందుకేసి.. తన ఆచార్య సినిమా షూటింగ్ ను కూడా ఆపించాడు. అంతే కాదు.. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న అన్ని సినిమాల వాళ్లకూ ఫోన్లు చేసి ‘మీకు బాధ్యత లేదా.. ఎందుకు షూటింగ్ చేస్తున్నారు. నేనే ఆపాను.. మీరు ఆపలేరా’ అంటూ కడిగిపడేస్తున్నాడట. వైరస్ పై పోరాటం చేయాలి. అవగాహన పెంచాలి. అంతేకానీ ఇంతమంది జనంతో షూటింగ్ చేయడం అంటే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకమే కదా.. అంటూ అందరికీ ఫోన్లు ఏకేస్తున్నాడట.
అదీ మేటర్.. ఆయన ముందు ఎవరూ ఏం మాట్లాడలేరు. అందుకే వెనక నుంచి కమెంట్స్ చేస్తున్నారట. పోన్లే.. ఎవరో ఒకరు ముందుకు వచ్చారు కదా. పరిశ్రమకు పెద్దన్నలాగా.. ఒక మంచి పనికి వెనక కొన్ని పనికి మాలిన మాటలు రావడం కూడా కామనే. అంచేత జై దాసరి చిరంజీవి..

Related Articles

Back to top button
Send this to a friend